పుట:మధుర గీతికలు.pdf/206

ఈ పుట ఆమోదించబడ్డది


అల్ల నా దారిఁ జనుచున్న పల్లెవానిఁ
బిలిచి రంగఁడు వానితో పలికె నిట్లు;
'ఏది చూతము జాలరీ నీదు నేర్పు!
పట్ట నేర్తు వె చేఁప లీ పదియ యందు?”

'చేఁప లుండినఁ గద నేర్పు చూపు టెల్ల !
నిన్న దాఁకను లే దిందు నీటిబొట్టు;
నిండె మాపటివానకు నీరు నేఁడు;
ఇంతలోననె మచ్చెంబు లెట్లు వచ్చు?'

అనుచు నవ్వుచు జాలరి చనియె; నంత
జాలెయును కోల భుజమున వ్రేలవైచి
చల్దిచిక్కము పెడకేల సంతరించి
అరిగె రంగఁడు 'టింగురంగా' యనంగ.

అపరదిక్కున భాస్కరుఁ డత్తమిల్లె,
తూర్పుదిక్కున చంద్రుండు తొంగిచూచె,
మినుకు మిను కని తారలు మెఱయుచుండె;
ఇంటి కేతెంచె రంగఁడు హితులఁ గూడి.

25