పుట:మధుర గీతికలు.pdf/205

ఈ పుట ఆమోదించబడ్డది


'అద్దిరా! ఎద్దియో యొక పెద్దచేఁప
నిక్కముగ నాదు వలయందు చిక్కుకొనియె,
ఎంత బరువుగ నున్నదో యిదిగో చూడు'
మనుచు రంగఁడు సఖులతో ననియె పొంగి.

లావుకొలఁదిని జాలెంబు లాగి రంత
ఒడ్డుమీఁదికి వారలు హు మ్మటంచు;
'చేఁప కాదుర‌ యిది దొడ్డ చాఁపఱాయి'
అనుచు రంగనితోఁ బల్కె ననుఁగుసఖుఁడు.

'చూడు మీసారి పట్టెద చోద్య మొప్ప
గొప్ప చేఁపల కుప్పలు తిప్పలుగను'
అంచు రంగఁడు జాలెంబు ముంచె మరల,
చిత్ర మది యేమొ ఒక చేఁప చిక్కదయ్యె,

వలను విసరుచు లాగుచు వార లంత
మడుఁగుచెంతను దిన మెల్లఁ గడపిపుచ్చి;
రొక్క టేనియు వలయందు చిక్కదయ్యె
మేలు మే! లెంత గడుసరి మీలొ కాని!

24