పుట:మధుర గీతికలు.pdf/202

ఈ పుట ఆమోదించబడ్డది


నాదు ముద్దులకొమరుండు నన్ను విడిచి
ఏడు మాసము లయ్యె, తా నెటకొ చనియె,
నింతకాలము దనుక నాచెంత రాఁడు;
అతని విడనాడి నే నింత బ్రతుకఁ గలనె?

నిన్ను బోలిన వన్నెలు చిన్నె లొలుకు
సోయగమువాఁడు, చక్కనిచుక్క యతఁడు;
చుక్కగమిలోన తా నొక్క చుక్క యగుచు
ఉన్నవాఁ డేమొ చూడుమా ఒక్కసారి,

ఉన్నచో వేగ నాతనియొద్ద కీవు
చేరి, మెల్లఁగ నడుగుమా చిన్నమాట:
ఇప్పుడై నను మఱియింక నెప్పు డైన
ఇచ్చటికి వాఁడు క్రమ్మఱ వచ్చునేమొ?

ఇటకు వచ్చుట కతని కనిష్టమైన
అటకు నన్నైన రప్పించు మంచు ననుము;
వాని కటు సేయ నలవి కా దేని, వాని
పొంత కీ వైనఁ దోడ్కొనిపొమ్ము నన్ను.

21