పుట:మధుర గీతికలు.pdf/201

ఈ పుట ఆమోదించబడ్డది

సందేశము


మేల్మిబంగరురంగుల మిసిమి మించు
వెలుఁగు లీనుచు, నో చిన్ని వేగుచుక్క!
ఒంటిగా నేల తిరిగెదు మింటిమీఁద?
నిలిచి నా మాటలకు మాఱుపలుక వయ్య.

ఒక్కటొకటిగ నీ తోడిచుక్క లెల్ల
ఓసరిల్లెను, తొలికోఁడి కూసె నదిగొ!
తూర్పుదిక్కున సంజలు తొలకరించె;
ఏల తిరిగెద వీ లీల బేల వోలె?

కలువచెలికాడు చని యొక్కగడియ యయ్యె
ఇనుఁడు చనుదెంచు క్షణములో; ఇంతలోనె
ఏల నెంచితె ఆకాశ మెల్ల నొకట?
నిలిచి నా మాటలకు మాఱు పలుక వయ్య!

20