పుట:మధుర గీతికలు.pdf/199

ఈ పుట ఆమోదించబడ్డది


“అమ్మ! భైరవి కెంతటి యాగడంబె?
బావిలో నున్న ముద్దుపాపాయితోడ
ఆడుకొనఁబోవ, న న్నది యదిమిపట్టి
చిన్ని మొకమాలుచొక్కాయి చించివైచె. "

“చూడు మమ్మరొ! ఇది యెంత చుప్పనాతి;
ఇంతసేపును నొతోడ పంతగించి
ఏమి యెఱుఁగని లాగున నీవు రాఁగ
నాకుచున్నది నను నంగనాచివోలె.”

“అమ్మ! నే నింక భైరితో నాడుకొనను
గెంటి వై చెద నవతలి కింటినుండి”
అనుచు దానిని చెవి పట్టి యవలఁద్రోచి
మూతిపై మూఁడు దెబ్బలు మోఁదె వాఁడు.

“అకట! కొట్టకు కొట్టకు మసుఁగుబిడ్డ !
చిన్ని బైరిని; అది నీకు చేసినట్టి
హితము మఱవంగ శక్యమే యెన్నడై న?
చిట్టిపాపవు నీ కది యెట్టు తెలియు?”

18