పుట:మధుర గీతికలు.pdf/198

ఈ పుట ఆమోదించబడ్డది


రెండుచేతులు బావిలో వ్రేలవైచి
రొమ్ము గట్టున నానించి హుమ్మటంచు
చిట్టిపదముల గిజగిజ కొట్టుకొనుచు
బావి నుఱుకంగ బాలుండు పట్టి పెనఁగె.

అలుకచే దన్ను బాలుండు బలముకొలఁది
నెంత తన్నిన, భై రవి శాంత మూని
గట్టిగాఁ దాను పట్టినపట్టు విడక
నూతఁ బడకుండ బాలుని నొక్కిపట్టె.

తల్లడంబున నది చూచి తల్లి యంత
చెంగు మని యొక్కగంతున చెంత కుఱికి
గొబ్బుగొబ్బున బిడ్డని గ్రుచ్చియెత్తి
అక్కునను జేర్చె మక్కువ యగ్గలింప.

సంతసంబున నంతట గంతులిడుచు
నేలఁ బొరలాడి భైరవి బాలుఁ గదిసి
తోఁక యాడించి పదముల నాక సాగె;
ఎట్టి తరితీపొ దాని కా బొట్టెమీఁద?

17