పుట:మధుర గీతికలు.pdf/195

ఈ పుట ఆమోదించబడ్డది


రాజ్య మెవ్వరిదైన, రా జెవ్వరైన,
నా కేమి లక్ష్యంబు? నా కేమి కొదువ?
రాజశాసనములు, రాజ్యాంగవిధులు
ఎన్ని మాఱినయేని న న్నేమి సేయు?

కఱువుపై కఱువులు కలుగుఁ గా కేమి,
పెట్టరే యెవరైన పట్టెడోగిరము?
సంతత మీశ్వరస్మరణమే కాని
ఇతర చింతలు నాకు నెవ్వియు లేవు.

అన్యుల పదవుల నాసింపఁ బోవ
పరులు నా పదవికి వాంఛింపఁ బోరు.
లక్షాధికారి యౌ భిక్షాధికారి
భిక్షాధికారి తా ఖేదంబు గనఁడు.

భిక్షుకవృత్తియే విశ్వేశ! నాకు
జన్మజన్మముల బ్రసాదింపు మయ్య!
పాఁడిపంటలు గల్గి, భాగ్యంబు గల్గి
ఎల్లవారలు సుఖియింతురు గాక!

15