పుట:మధుర గీతికలు.pdf/193

ఈ పుట ఆమోదించబడ్డది


ఇఱుకుసందుల వెంబడి మెఱక నుండి
వఱ్ఱు లొడ్డుచు ప్రవహించె వాననీరు?
తల్లిదరినుండి అల్లరి పిల్లవాఁడు
కేరిగంతులు వై చుచు పాఱినట్లు.

నిండిపోయిన చెరువులనుండి పొంగి
పొలములోనికి పొరలిన జలముతోడ
కొట్టుకొనివచ్చు చేఁపలఁ బట్టుకొనఁగ
సంభ్రమంబున మూఁగిరి జనము లెల్ల.

రయముగాఁ బాఱు వానగుఱ్ఱాల నెక్కి
మబ్బురౌతు లుడాయించి రుబ్బు మెరయ
మెఱపుకొరడాల ఝళిపించి తఱటుచేసి;
ఏల వెడలెదు బాలుఁడా! యిల్లు విడిచి?

పండువెదురుల సందులనుండి గాలి
బుస్సుబుస్సున వెడలుచు బుసలుకొట్టె,
బొరియలోపలఁ జిక్కిన భుజగివోలె;
ఎచటి కేగెదు బాలుఁడా। యిల్లు వెడలి?

12