పుట:మధుర గీతికలు.pdf/191

ఈ పుట ఆమోదించబడ్డది

ఎచటి కేగెదు బాలుఁడా!


కాఱుమబ్బులు చదలెల్లఁ గడలుకొనియె
చిమ్మచీఁకటి దిశలెల్లఁ గ్రమ్ముకొనియె
రివ్వు రివ్వున పెనుగాలి ఱువ్వఁ దొడఁగె
ఎచటి కేగెదు బాలుఁడా: యిల్లు వెడలి?

కలయ మిన్నును మన్ను నేకంబు గాఁగ
బోరుబోరునఁ దోరంపుధార లడర
కుంభవృష్టిగ వర్షంబు కురియుచుండె
ఏల వెడలెదు బాలుఁడా! యిల్లు విడిచి?

ఆకసంబున తూనీఁగ లాడఁ జొచ్చె
గుంపులుగఁ గూడి చీమలు గ్రుడ్లు మోచె
కొంగకదుపులు బారులై నింగి కెగసె
త్రాఁచుపాములు పుట్టల దాఁగియుండె.

10