పుట:మధుర గీతికలు.pdf/176

ఈ పుట ఆమోదించబడ్డది

చంద్రోదయము


అంబరం బను కమలాకరంబునందు
కైరవంబుల కైవడి తార లలర,
అందు విహరించు కొదమరాయంచ యనఁగ
నిండు చంద్రుఁడు కన్నులపండు వయ్యె.

పొంచి తెరవెన్క దాఁగి దోబూచులాడు
ముద్దు గులికెడు పసిపాపమొగము వోలె,
కారుమబ్బులసందునఁ గాన నగుచు
ఇందుబింబము లోచనానంద మయ్యె.

అంబరం బను నీలిపళ్లెంబునందు
అక్షతలు వోలె నక్షత్రకాళి మెఱయ,
తేజరిల్లెడు కపురంపుదీప మనఁగ
నిండుచంద్రుఁడు కన్నులపండు వయ్యె.

41