పుట:మధుర గీతికలు.pdf/174

ఈ పుట ఆమోదించబడ్డది


ఒకదినంబున క్షత్రియుఁ డుదయవేళ
ఖడ్గ మొక్కటి కరమున కరము మెఱయ,
వడి హుటాహుటినడలతో నడచుచుండ,
సూరకవి చూచి యాతనిఁ జేర నరిగి.

“ఓయి నా కీవు క్షురకర్మ చేయఁ గలవె ?”
అనుచు ప్రశ్నింప, క్షత్రియుఁ డలుక గదుర
“కనులు గానవ ? నీ కింత కావరంబ?
మూఢుఁడా ! నేను మంగలివాఁడ నఁటర ?”

అంచు గద్దింప, చాలు శాంతించు మయ్య !
ఇంత పొడవైన కత్తి నీచెంత నుండ
ఔర ! క్షురకర్మ నైన చేయంగ లేవె?
అనుచు నెంచితి ” నని కవి యపహసించె.

39