పుట:మధుర గీతికలు.pdf/169

ఈ పుట ఆమోదించబడ్డది

గురువు - శిష్యులు


తెలివి మాలిన గురునొద్ద తెలివి లేని
శిష్యు లిరువురు పరిచర్య చేయుచుండి;
రొకదినంబున వారి నాయొజ్జ పిలిచి
పుచ్చె నడవికి సమిధలఁ దెచ్చి పెట్ట.

అడవిఁ జొచ్చినతోడనే హరిణ మొకటి
వారి కెదురుగఁ గనఁబడె; వారు దాని
చూచీ యెన్నడు నెఱుఁగని శుంఠ లగుట
చర్చ గావించి రది యేమిజంతువొ యని.

'శంక యేటికి దీనికి చర్చ యేల ?
తెల్లముగ నది యేనుంగుపిల్ల గదర'
'వ్యర్థముగ దీని కింకను వాద మేల ?
కుంజరము కాదు, సింగంపుగొదమ కాని.'

34