పుట:మధుర గీతికలు.pdf/166

ఈ పుట ఆమోదించబడ్డది

రాజు - కాఁపువాఁడు


ఒక్కనాఁ డొకభూవరుఁ డుదయ వేళ
హయముపై నెక్కి స్వారికి బయలు వెడలె;
కోట దాఁటి యతం డట్లు కొలఁదిదూర
మేగుసరి కొకకాఁపువాఁ డెదురుపడియె.

ఏమిచిత్రమొ కాని - యానృపునిహయము
కాఁపువానిని దవ్వునఁ గాంచినంత
బెదరి యట్టిట్టు గంతులువేసి తుదకు
నేలమీఁదికి భూవరుఁ గూలఁద్రోసె.

క్రిందఁ బడినను గాయంబు నొందకుండ
తోడనే లేచి యొడ లెల్లఁ దుడిచికొనుచు
హయముపై నెక్కి క్రమ్మర రయము మీఱ
కోటలోనికిఁ జనె ఱేడు కోప మడర.

31