పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/240

ఈ పుట ఆమోదించబడ్డది

తెలంగాణ పోరులో కమ్యూనిస్టు యోధురాలు

జమాలున్నీసా బాజి

జాతీయోద్యమంలో ప్రవేశించి తద్వారా బ్రిటిషర్ల బంధనాల నుండి విముక్తి కోసం పోరాటం మాత్రమే కాకుండ విముక్తి పోరాటాల స్పూర్తితో సమతా-మమతల వ్యవస్థలను స్థాపించి జాతి జనులకు ఉత్తమోత్తమ వ్యవస్థను అందించాలన్న లక్ష్యయంతో ముందుకు సాగిన మహిళలు ఎందరో. ఆ క్రమంలో ఇండియన్‌ యూనియన్‌లో నైజాం విలీనం కోరుతూ సాగిన ఉద్యమంలో పాల్గొనటమే కాకుండ ఆతరువాత సాగిన తెలంగాణ సాయుధ పోరాట సమయంలో ప్రజల పక్షం వహించి పోరుబాటన నడిచిన మహిళా ఉద్యమకారులలో జమాలున్నీసా బాజి ఒకరు.

జమాలున్నీసా 1915 ప్రాంతంలో హైదరాబాదు సంస్థానంలో జన్మించారు. ఆమె తల్లి హైదారాబాదుకు చెందినవారు కాగా తండ్రిది ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రం. ఆయన నైజాం సంస్థానంలో న్యాయాధికారిగా పనిచేశారు. కుటుంబంలోని పెద్ధలు ఆచార సంప్రదాయాల పట్ల అనురక్తులైనప్పటికి తల్లితండ్రులు మాత్రం ఉదార స్వభావులు. తల్లి తండ్రులు చిన్ననాటి నుండే తమ పిల్లలకు తగినంత స్వేచ్ఛ కల్పించారు. ప్రధానంగా తండ్రి నుంచి లభించిన స్వేచ్ఛ ఫలితంగా చిన్నతనంలోనే జమాలున్నీసాకు స్వ్వతంత్ర భావనల తోపాటుగా జాతీయ భావనలు అలవడ్డాయి.

237