పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ఆంధ్రప్రదేశ్ ముస్లింలు.pdf/33

ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్య్రోద్యమం: ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు

పోరుబాటను ఎంచుకోవడమే కాకుండా మొహర్రం పండగ సందర్భంగా తెల్లవారి పాలన తప్పక అంతరిస్తుందని ఎంతో ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు. ఈ రకంగా తెలుగుగడ్డ మీద అక్కడక్కడ సాగిన తిరుగుబాట్లకు మొహర్రం పండుగ రోజును నిర్దేశిత సమయంగా నిర్ణయించడం కాకతాళీయమా? లేక మొత్తం మీద ఓ పథకం ప్రకారంగా తిరుగుబాట్ల్లు సాగాయా? అను విషయం చాలా ఆసక్తిదాయకం. ఈ నిర్ణయానికి అనుగుణంగా స్వదేశీ సైనికులను ఆకట్టుకుని తిరుగుబాటుకు షేక్‌ పీర్‌ సాహెబ్‌ ముమ్మరంగా సన్నాహాలు ఆరంభించారు. ఈ పథకం పూర్తిగా అమలులోకి రాకముందే, ఆయన చర్యలను పసికట్టిన బ్రిటిష్‌ సైనికాధికారులు పీర్‌ సాహెబ్‌ను అరెస్టుచేసి, విచారణ జరిపి 10 సంవత్సరాల జైలుశిక్ష విధించగా, తిరునల్వేలి ఖైదులో షేక్‌ పీర్‌ సాహెబ్‌ జీవితం ముగిసింది.

ఈ ప్రయత్నాలలో భాగంగా మహమ్మదీయ న్యాయశాస్త్ర అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మౌల్వీ సయ్యద్‌ అజీజ్‌ హుస్సేన్‌ ఇణ్టింటికి తిరిగి ఆహారపదార్ధాలు, డబ్బు సేకరించారు. తుపాకులకు పూసే గ్రీసులో పంది, ఆవు కొవ్వు ఉంటుందన్న విషయం ప్రచారం చేసి సైనికులను రెచ్చగొట్టారు. ఫలితంగా కంపెనీ సైన్యాధికారులు ఆయనను అరెస్టు చేసి, ఆయన కార్యకలాపాలను రాజద్రోహ చర్యలుగా ప్రకటించి, పది సంవత్సరాల జైలు శిక్షవిధించి ఆయనను కూడా తిరునల్వేలి జైలులో నిర్బంధించారు.

ప్రజ్వరిల్లిన కృష్ణా-గుంటూరు గోదావరి సీమలు

నిజాం గడ్డ మీదతిరుబాటు ప్రకటించినవారు, సాహసోపేతంగా నిజాంకు, ఆంగ్లేయులకు హెచ్చరికలు చేసిన యోధులు, ఉత్తరాదిలో జరిగిన తిరుగుబాటులలో పాల్గొన్నవారు స్వగ్రామాలకు, స్వంత స్థలాలకు తిరిగివచ్చి అక్కడి సాహసాలను వర్ణిస్తూ కథలుగా చెప్పడంతో స్థానికులైన సాహసులు అక్కడక్కడ ఆంగ్లేయుల మీద తిరగబడ్డారు. ఈ తిరుగుబాట్లలో ముస్లిం యోధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

1857 జూలై మాసంలో మచిలీపట్నంలోని సిపాయీలు పెరేడ్‌ జరుపు మైదానం ఎదురుగా ఆకుపచ్చని పతాకాన్ని రహస్యంగా ఎగుర వేశారు. ఆంగ్లేయులను నరికి వేయండి అంటూ హిందూస్థానిలో నినాదాలు రాసిన ప్లకార్డు కూడా ఆ జెండాకర్రకు కట్టి ఉంది. ఈ దృశ్యం ఆంగ్లేయాధికారులలో తీవ్ర కలవరానికి కారణమైంది. ఆ చర్యకు పాల్పడిన వారినిపట్టుకున్నట్టయితే 500 రూపాయాల బహుమానం ఇస్తామని కూడ ప్రకటించారు. ఆంగ్ల అధికారులు ఎంత ప్రయత్నించిన ఆ దృశ్యాన్ని రూపొందించిన సాహసుల ఆచూకిని ఏమాత్రం కనిపెట్టలేకపోయారు. (The Freedom Struggle in Andhra Pradesh (Andhra), Volumes I(1800-1905 AD), Govt. of AP, Hyderabad, 1997, Page. 147)

33