పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ఆంధ్రప్రదేశ్ ముస్లింలు.pdf/30

ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

ఈ విషయాన్ని బ్రిటిష్‌ సైనికాధికారి Captain Abbot తన లేఖలలో వివరంగా పేర్కొన్నాడు. ఎంతమంది యోధులను ఎలా ఉరి తీసింది, ఎలా ఫిరంగులకు కట్టిపేల్చి వేసింది, ఎంతమందికి ఏ విధంగా శిక్షలు వేసింది ఆయన పేర్కొన్నాడు. ఆ సమయంలో తిరుగుబాటు యోధులలో కన్పించిన నిర్భయత, ప్రశాంతతలను కూడా ఆ ఆంగ్లేయుడు తన ఉత్తరాలలో వివరంగా నమోదు చేశాడు. ఆనాటి శిక్షల అమలు, ఆయా సంఘటనల విశేషాలను ఆ అంగ్లేయాధికారి ఈ విధంగా వివరించాడు.

మేం మొదట పట్టుకున్న 94 మంది ఖైదీలలో ఒకరిని ఉరితీశాం. నల్గురిని కాల్చి చంపాం. ఒకడ్ని ఫిరంగులతో పేల్చివేశాం. ఆ దృశ్యం ఎంతో భయంకరంగా ఉంది. వాడి తల దాదాపు 20 గజాల పైకి ఎగిరింది. వాడి రెండు చేతులు రెండు వైపులకు దాదాపు ఎనిమిది గజాల దూరంలో పడ్డాయి. వాళ్ళు ఎంతో మామూలుగా తమకు విధించిన శిక్షలను గురించి వినటం చూసి ఆశ్చర్యపోయాను. ఫిరంగి ముందు నిలబడ్డ వ్యక్తి తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వారు భగవంతుని ఎదుట సమాధానం చెప్పవలసి వస్తుందని ప్రకించాడు.తన్ను ఫిరంగికి కట్టవద్దని కోరాడు. తాను భయపడనని అన్నాడు. నేను నన్నుశుభ్రపర్చుకున్నాను. దాంతో నా పాపాలన్నీ కడిగేసుకున్నాను. ఎంత త్వరగా నేను స్వర్గానికి వెడితే అంత సుఖం అని ఉరితీయబడిన వ్యక్తి అన్నాడు...పట్టుబడ్డ ఖైదీలలో ఇద్దర్ని పేల్చివేశాం, మరో నలుగురిని కాల్చి చంపాం. నల్గురికి శిక్ష తగ్గించాం. మరో వందమంది నిరాయుధుల్ని చేసి వెళ్ళగొట్టాం. ఓ యాభై మందికి కొరడా దెబ్బల శిక్ష విధించాం...ఇంకా మేము చేయాల్సిన ఇటువంటి పని ఎంతోఉంది. (నిజాం-బ్రిటిష్‌ సంబంధాలు,సరోజిని రెగాని,మీడియా హౌస్‌ పబ్లికేషన్స్‌,హైదారాబాద్‌,2002, పేజి.326)

( "...We have already disposed off a goodly number of the 94 prisoners we took in the first haul of the net; one has been hanged, 4 shot, one blown away from a gun, a frightful sight indeed ; his head ascended about 20 yard in the air and his arms were thrown eight yards in either direction! I was astonished to see how coolly they received intelligence that they were to suffer death..." - The Freedom Struggle In Hyderabad, Volume II (1857-1885) Govt. of AP, 1956, Page. 38-39).

అంతేకాదు జమేదార్‌ చిద్దాఖాన్‌ నాయకత్వంలో నిజాం సరిహద్దుల్లోని బుల్దానాలో ఉన్న హైదారాబాద్‌ కాల్బలం తిరగబడింది. తిరగబడిన సైనికులు స్ధావరాలు వదలి వెళ్ళి పోయారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటానికి నిజాం సహాయం కోరేందుకు తిరుగుబాటు వీరుడు చిద్దాఖాన్‌ పదిమంది సహచరులతో హైదారాబాద్‌ వచ్చారు. ఆ యోధులకు సహాయం అందచేసి ఆంగ్లేయులతో శత్రుత్వం కొని తెచ్చుకోడానికి నిజాం నవాబు సిద్ధంగా లేడు. అందువల్ల చిద్దాఖాన్‌ నగర ప్రవేశం చేయగానే ఆయనను, ఆయన అనుచరులను అరెస్టు చేయించాడు. ఈ చర్యతో ప్రజలలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి.

30