పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ఆంధ్రప్రదేశ్ ముస్లింలు.pdf/28

ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

పోరుబాటలో మౌల్వీల మహత్తర పాత్ర

ప్రధానంగా సైనికులలో, ప్రజలలో ఆంగ్లేయుల పట్ల విద్వేషం మరింతగా పెంపొందించడంలోనూ ఆనాటి చారిత్రక తిరుగుబాటుకు ధార్మిక పండితులైన మౌల్వీలు, ఉలేమాలు వెన్నెముకగా నిలిచారు. ప్రజలను ప్రేరేపించి వారు పోరుబాటన నడిచేందుకు తగిన విధంగా సన్నధులను చేయడంలో మౌల్వీలు పాత్ర ఎంతో ఉంది. ఈ మౌల్వీలు ప్రజలను ప్రేరేపించడం, ప్రోత్సహించడంతో సరిపెట్టుకోలేదు కదనరంగంలో అందరి కంటె ముందు నిలిచారు. కత్తిపట్టి కదనరంగాన నడిచి ఇతరులకు మార్గదర్శకులయ్యారు. చివరకు బలమైన స్వేచ్ఛ-స్వాతంత్య్ర కాంక్షకు, కరడుకట్టిన బ్రిటిష్‌ వ్యతిరేకతకు ప్రతీకలయ్యారు.

ఈ మేరకు మౌల్వీ ఇబ్రహీం, మౌల్వీ అక్బర్‌, మౌల్వీ అల్లాద్దీన్‌ తిరుగుబాటును ప్రోత్సహించడమే కాకుండా తిరుగుబాటు యోధులకు ముందు నిలచి మున్ముందుకు నడిపించారు. నైజాం సంస్థానం రాజధాని హైదారాబాదు గడ్డ మీద తొలిసారిగా మౌల్వీ ఇబ్రహీం తిరుగుబాటు బావుటాను ఎగురవేశారు. ఆ కారణంగా నిజాం పాలకులు, మౌల్వీలకు, ధార్మిక పండితులకు, ధర్మప్రచారకులకు, ఫకీర్లకు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేయాల్సి వచ్చింది. అయినా ఏమాత్రం భయపడక ఆ స్వేచ్ఛాభిలాషులు ముందుకు సాగారు.

ఆ కారణంగా మౌల్వీలు, ఫకీర్ల మీద ఆంగ్లేయాధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. బోయినపల్లిలో ఓ ఫకీరు బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా ప్రబోధం చేస్తుంటే అతనిని బంధించి జైల్లో వేశారు. ఆనాడు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ప్రజలను, నవాబును రెచ్చగొడుతూ అంటించిన కరపత్రాలు చూసి ఆరాధానా మందిరాలలో ఆ విషయాలను ప్రస్తావించి ప్రజలను ఉసిగొల్పకుండ ఉండేందుకు మౌల్వీలు, ఫకీర్ల పట్ల చాలా కఠినంగా ప్రవర్తించారు. బ్రిటిష్‌ వ్యతిరేకి అని చిన్నపాటి అనుమానం కలిగినా ప్రతి ఫకీరును, ప్రతి మౌల్వీని నిర్బంధించారు. ఈ మేరకు ఆంగ్లేయులు, నిజాం నవాబు ఎంత కఠినంగా ప్రవర్తించినా ప్రజలలో ఆంగ్లేయ వ్యతిరేక ప్రచారం నిరంతరం సాగింది. ఆ ప్రచారం తీవ్రస్థాయికి చేరుకుని చివరకు ప్రజానీకాన్ని పోరుబాట పట్టించగా, స్వదేశీ సైనికులలో నిరసన జ్వాలలను రగిలించింది.

స్వదేశీ సైనికులలో తిరుగుబాటు జ్వాలలు

ఒక వైపున ప్రజలలో పోరాటం గురించి ఆలోచనలు సాగుతుండగా ఆ ఆలోచనల ప్రభావంతో నైజాం సంస్థానానికి చెందిన సైనికులలో కూడా తిరుగుబాటు జ్వాలలు రగిలాయి. ఆ సైనికుల మీద ఆధిపత్యం చలాయిస్తున్న ఆంగ్లేయ ఉన్నతాధికారులను ఏమాత్రం ఖాతరు చేయకుండా స్వదేశీ సైన్యాధికారులు, సైనికులు బాహాటంగా తిరగబడి కలకలం సృష్టించారు.

28