పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ఆంధ్రప్రదేశ్ ముస్లింలు.pdf/22

ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

సిపాయీలు తొలిసారిగా తిరుగుబాటు చేసిన వైనం తేటతెల్లమౌతోంది.

ఆనాడు విశాఖపట్నంలో ఆరంభమైన సైనికుల తిరుగుబాటు తరువాత 1806లో తమిళనాడులోని వెల్లూరు సైనికస్థావరంలో మరో తిరుగుబాటు జరిగింది. ఈ రెండు తిరుగుబాట్లు కూడ దక్షిణాదిలో జరగటం విశేషం. ఈ తిరుగుబాట్ల తరువాత మాత్రమే 1824లో ఉత్తర భారతదేశంలోని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం గోరఖ్‌పూర్‌లో స్వదేశీ సిపాయీలు ఆంగ్లేయ అధికారుల ఆజ్ఞలను వ్యతిరేకిస్తూ తిరగబడిన ఘట్టాలు జరిగాయి.

ఈ విధంగా చూస్తే దేశంలో ఉత్తరాదికాని దక్షిణాదికాని ఎక్కడ ఏ ప్రాంతంలో ఏం జరిగినా ఆ పోరాటాల ప్రభావం, ఆ పోరాటాలలో ప్రధాన పాత్రధారుల వ్యక్తిత్వాల ప్రభావం దక్షిణాది ప్రాంతాలకు తద్వారా ఆంధ్రాప్రదేశ్‌కు కూడ విస్తరించిన వైనాన్ని గమనించ వచ్చు. ఆ కారణంగా తొలుత ఈస్ట్‌ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా ఉద్యామాలన్నీఎక్కడో బెంగాల్‌ ప్రాంతంలో ఆరంభమైనప్పటికి ఆ ఉద్యమాల ప్రకంపనలు తిన్నగా ఆంధ్రావనిని కూడా తాకిన సంఘటనలు చరిత్రలో దర్శనమౌతున్నాయి.

ఆంగ్లేయుల పెత్తనాన్ని అంగీకరించని నూరుల్‌ ఉమ్రా

స్వజనుల మీద బ్రిటిషర్ల పెత్తనాన్ని సహించలేక, ఆంగ్లేయాధికారుల చర్యలను వ్యతిరేకించిన తొలినాటి ప్రముఖులలో నూరుల్‌ ఉమ్రా బహుదూర్‌ ఒకరు. ఆయన నైజాం దర్బార్‌లో అతి ముఖ్యుడు. సికింద్రాబాద్‌లోని ఈస్ట్‌ ఇండియా కంపెనీలోని స్వదేశీ సైనికులను బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా వ్యవహరించమంటూ 1806 ప్రాంతంలో నూరుల్‌ ఉమ్రా ప్రోత్సహించారు. ఈ ప్రేరణతో ఆంగ్లేయాధికారుల చర్యలు నచ్చని పలువురు సైనికులు, కంపెనీ సైన్యం నుండి వైదొలగి నూరుల్‌ ఉమ్రా పక్షాన చేరారు. ఆ కారణంగా ఆయన నైజాం నవాబు ఆగ్రహానికి గురయ్యారు. ఆంగ్లేయాధికారుల సలహాల మీద నిజాం నవాబు ఆయనను తన దర్బారు నుండి బహిష్కరించి, ఉస్మానాబాద్‌ జిల్లాలోని ఔసా కోటలో జీవితాంతం నిర్బంధించారు. చివరకు నూరుల్‌ ఉమ్రా 1818లో కన్నుమూశారు.

తెలుగుగడ్డ మీద వహాబీల ఉదృత ఉద్యమం

1820లో ఆరంభమై వహాబీల ఉద్యమం 1870 వరకు ఉదృతంగా సాగింది. ఈ ఉద్యమానికి కూడా ఆంధ్రావని ప్రతిస్పందించింది. ప్రజాస్వామ్యం లేకున్నా, నవాబుగిరి సాగుతున్నా, ప్రజలు మాత్రం బ్రిటిషర్ల పెత్తనాన్ని వ్యతిరేకించారు. నవాబులు ఇంగ్లీషు వారికి గులాంగిరి చేయడానికి అంగీకరించినా, ప్రజలు మాత్రం ససేమిరా అన్నారు. చివరకు నైజాం నవాబుల వంశంలోని వారు కూడా ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని, పెత్తనాన్ని చాలా

22