పుట:భాగవతము - ఏకాదశస్కంధము (హరిభట్టు).pdf/75

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

75

ఏకాదశస్కంధము


వ.

అని పలికిన సర్వంసహాసురేంద్రునకు నారాయణుం డి ట్లనియె.

302


సీ.

కృతయుగంబందు సత్కృతుఁడనై
        హంసరూపంబున నలరియుందు
ఆ యుగంబున ధర్మ మంతయు వృషరూప
        మున వృద్ధిబొందును దినదినంబు
త్రేతాయుగంబునఁ జాతురి నా ధర్మ
        మంతయుఁ బాదత్రయమునఁ దనరు
ద్వాపరంబందుఁ బాదద్వయంబున నది
        వర్తించు నెచ్చోట వరుస చెడక


గీ.

బలిమి నొందక కలియుగంబందుఁ బాద
మాత్రమున నుండి యదియును మాసిపోవు
నీ విధంబున ధర్మంబు నేపు దప్పి
యుగయుగంబున వర్తించు నుర్విమీద.

303


సీ.

ఆరయ వక్త్రబాహూరుపాదములందు
        రమణవిప్రాదివర్ణములు పుట్టె
యజ్ఞంబు సత్య మధ్యయనంబు శమమును
        విప్రధర్మంబులై వెలయుచుండు
దాన మాస్తిక్యంబు దయయును శౌర్యంబు
        క్షత్రధర్మంబులై జరుగుచుండు
నియమంబు శాంతి వాణిజ్య గోరక్షణా
        దులు వైశ్యధర్మము తెలిసి చూడ


గీ.

విప్రసేవయు దానంబు విష్ణుభక్తి
స్వామికార్యంబు మాయగాఁ జరుపకుంట
జయము చేఁగొంట శత్రుల సమయఁజేయు
టరయ నివి శూద్రధర్మంబు లన్నిదిశల.

304