పుట:భాగవతము - ఏకాదశస్కంధము (హరిభట్టు).pdf/71

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకాదశస్కంధము

71


సీ.

హరిభక్తి గలవాని చరణరేణుచయంబు
        సోఁకిన భూ మెల్ల శుద్ధి పొందు
హరిభక్తి గలవాని కన్నంబుఁ బెట్టిన
        నరు నింట [1]వేడుక నారగింతు
హరిభక్తిసంపన్నుఁ డగువాని సేవింపఁ
        బాపతూలాద్రులు భస్మ మగును
హరిభక్తిసంయుక్తుఁ డగువాని వెనువెంట
        దిరుగులాడుచు నుందుఁ దెలివి సెడక


గీ.

వ్రతము లైనను సంతతక్రతువు లైన
ధర్మ మైనను బహువిధాధ్యయన మైన
నీడుజోడుగ మద్భక్తితోడ నెపుడు
[2]సవతు రా నేర వెచ్చోట సంయమీంద్ర.

292


గీ.

భోగవాంఛతోడఁ బొదలెడి చిత్తంబు
భోగ్యవస్తుసమితి పొందుఁ గోరుఁ
దనివి లేక నన్నుఁ దలఁపుచు వర్తించు
మనము మత్పదాబ్జమున నిలుచు.

293


శా.

కాంతసంగము మాని సంతతము నేకాంతప్రదేశంబునన్
శాంతుండై ధనదారమోహకలితేచ్ఛావర్జితుండై రమా
కాంతుం డౌ నను నెప్డుఁ బ్రేమమున మోక్షప్రాప్తికై యోగి శు
ద్ధాంతఃపద్మమునం దలంపవలయు హర్షోల్లాసత్స్వాంతుఁడై.

294


మ.

హరి యీ రీతిని నానతిచ్చిన మునీంద్రాగణ్యుఁ డా పంకజో
దరుతో ని ట్లనియెన్ సమస్తజగదాధారప్రపన్నార్తిసం
హర యెవ్వానిమనంబులోఁ దలఁచి యోగారూఢుఁ డింద్రాది డు
స్తరయుష్మత్పదవాసియై తనరుఁ దద్ధ్యానంబు వర్ణింపవే.

294
  1. నే భోజనంబు సేతు - వ్రాఁతప్రతి
  2. సమత కానేరవు - వ్రాఁతప్రతి