పుట:భాగవతము - ఏకాదశస్కంధము (హరిభట్టు).pdf/7

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకాదశస్కంధము

7


క.

ధరణీసురుల మనంబుల
పరితాపము మాన్చి వారి భక్తిని భజియిం
తుర యెవ్వరేని వారికి
సిరి యాయువు గలిగియుండుఁ జిరకాలంబున్.

26


వ.

అని పలికి వెండియు.

27


క.

విచ్చలవిడి మును లందఱు
సచ్చట మామీఁది భక్తి నెలమి దలిర్పన్
విచ్చేసినకారణ మిది
చెచ్చెర నా కానతిండు శీఘ్రముతోడన్.

28


వ.

ఇట్లు బలభద్రానుజుండు పలికిన మును లిట్లనిరి.


క.

వనజాతరమ్యలోచన
మునిహృదయాంతర్నివాసమోదముతోడన్
బనివింటిమి నిను దర్శిం
పను నింతకు నెక్కుడైన పనులుం గలవే.

29


వ.

అని సన్నుతించి మునువరులు నిజనేత్రచకోరంబులచే వాసుదేవ
వదనచంద్రచంద్రిక పానంబుచేసి తద్విసృష్టులై ద్వారకానగరంబున
కనతిదూరంబున విండాతకంబను పుణ్యతీర్థంబున కరిగి రంత.

30


సీ.

దర్పితులైన యాదవకుమారులు గూడి
        జాంబవతీసూను సాంబుఁ బిలిచి
సకలభూషణములు సమకూర్చి వానిని
        గామినిరూవంబుగా నొనర్చి
మూకలై నవ్వుచు మును లున్నచోటికిఁ
        జని దుర్వినీతులై సాగి మ్రొక్కి
యడుగ సిబ్బితిపడి యట మాటుపడియున్న
        దీగర్భవతియైన యింతి కెవ్వ
రుదయమయ్యెద రూహించి హృదయమందు
నట్టి వృత్తాంత మంతయు నానతీయ
వలయు నని పల్కి ముందఱ నిలచినట్టి
డింభకులఁ జూచి మునులు సంరంభమునను.

31