పుట:భాగవతము - ఏకాదశస్కంధము (హరిభట్టు).pdf/67

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకాదశస్కంధము

67


బుల గ్రసియించు. జీవుండు సకలదేహాంతరగతుండై యచ్ఛేద్యుండై
యదాహ్యుండై యశోష్యుండై వర్తించు, ఈ జీవుండు సంసారచక్ర
పరిభ్రమితుండై జన్మావ్యయంబులఁ బొందుచుండు. అట్టి పురాతనం
బైన సంసారమహీరుహంబు కర్మాత్మకంబై శతమూలసమేతంబై
నాళత్రయంబు కలిగి పంచస్కంధవిశాలంబై పంచరస ప్రసూతి
జనకంబై దశైకశాఖానిస్తృతంబై సుపర్ణద్వయసేవితంబై ఫలద్వ
యవిరాజితం బగు. అం దొకఫలంబును గ్రామచరులును మరియు
నొక్కఫలంబు నరణ్యవాసులును భుజింతు. రివ్విధంబున బహు
విధంబై మాయారూపంబగు నీ సంసారమహీరుహంబును సద్గురు
సేవామూలంబున సంభవించు విద్య యను కుఠారంబున మొదలు
ముట్టం దునిమి యప్రముత్తుండవై యాత్మ నాత్మతోఁ గూర్చి కర్మంబ
బరిత్యజింపవలయు నని యశోదానందనుం డానతిచ్చిన మరియు
ని ట్లనియె.

276


సీ.

సత్త్వరజస్తామసములు నాఁ బరగును
        సద్గుణత్రయమందు సత్త్వగుణము
సుజ్ఞానజనకమై శుభదాయకం బగు
        నది గాక సాత్త్వికం బైన యట్టి
సకలధర్మమ్ములఁ జరియింపవలయును
        బహువిధంబుల మదర్పణము గాఁగ
నా రజోమూలమై నట్టి ధర్మంబులు
        చర్చింపఁగాఁ బునర్జననహేతు


గీ.

వందుఁ దామసధర్మంబు లఖిలనరక
కారణంబులుగాన, నీ క్రమముఁ దెలిసి
నరుఁడు సాత్త్వికమూల మై నట్టి ధర్మ
మాచరింపంగవలయు విఖ్యాతితోడ.

277