పుట:భాగవతము - ఏకాదశస్కంధము (హరిభట్టు).pdf/63

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకాదశస్కంధము

63


గీ.

కాన మానవు డన్యమార్గంబునందుఁ
దెలివి వర్ణించి రూఢి వర్తించెనేని
ధనము వాంఛించి, విధిలేని తావు వెదకు
నతనిరీతిని విఫలత్వమందుఁ బిదప.

261


సీ.

క్రమమునఁ గర్మమార్గమున వర్తింపుచు
        ఫలమంతయు మదర్పణము సేసి
మన్నామ మనయంబు మదిలోనఁ దలఁపుచుఁ
        దుదిముట్ట మద్భక్తిఁ బొదలిబొదలి
సత్సంగతులఁ బొంది షడ్గుణైశ్వర్యసం
        పన్నుండనౌ నన్నుఁ బరమయోగి
చిత్తాంబుజాంతరస్థితునిగాఁ దలపోసి
        వితతమల్లక్షణాంకితుఁడ వగుచు


గీ.

మత్ప్రియంబుగ ధర్మకామముల నెప్పు
డాచరింపుచు మత్పరాయణుఁడ వగుచు
నఖిలజగమును మద్రూపమని యెఱింగి
పుడమిలోపలఁ జరియింపు భూసురేంద్ర.

262


వ.

అని యశోదానందనుండు మందహాసంబుసం బలికిన ధరణిసురుం
డిట్లనియె.

263


క.

ఏ విధమున నీ రూపము
భావంబునఁ దెలియవచ్చు, భక్తి యనఁగ నే
భావంబున నుదయించును
శ్రీవర నా కానతిమ్ము చిత్రచరిత్రా.

264


చ.

అనిన ధరాసురేంద్రునకు నావసుదేవకుమారుఁ డిట్లనున్
వినుము మునీంద్ర, భావమున వీక్షణ సేయుము, నన్ను భక్తితోఁ
గనకమయాంశుకోజ్జ్వలునిగా, జలజాంబుజ [1]శంఖనందకా
భినుతకరాబ్జుగా విమలబింబఫలాధరుగా నుదారతన్.

265
  1. ఈ ప్రయోగము తాళపత్రమున నిట్లనే యున్నది.