పుట:భాగవతము - ఏకాదశస్కంధము (హరిభట్టు).pdf/62

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

ఏకాదశస్కంధము


వ.

మఱియు బద్ధముక్తులకు వైలక్షణ్యంబుఁ జెప్పెద. విరుద్ధధర్మంబు
గల రెంటిని నొకధర్మంబందుఁ బ్రవర్తించువానిగా నెఱుంగుము.
ఒక్క మహీరుహంబుదు నన్యోన్యమిత్రత్వంబు బాటిల్లుచు నిజ
నిలయంబందు సుపర్ణద్వయంబు వర్తించు నందొక్కటి పిప్పలాశి
యయ్యె. తదితరంబైన యది యశనఖాదనంబు సేయక బలసమే
తంబై యధికంబుగ వర్తించు. నం దవిద్యాసహితంబైనది నిత్య
బంధనంబునన్, విద్యాసహితంబైనది నిత్యముక్తం బయ్యును వర్తిం
చును. ఇట్టి మాయారూపంబైన మహీరుహంబును సమ్యగ్జ్ఞానం
బున నెఱింగి యర్థంబుల నిందియములచేత గ్రహింపుచు వికార
రహితుండై సంచరించు పరమయోగి ముక్తుండగు. దైవాధీనంబగు
శరీరంబుచేఁ గర్మాచరణంబు సేయుచుఁ గర్తృత్వంబు భజియించి
జీవుండు బద్ధుండగు. ఇట్లు బద్ధముక్తలక్షణం బెఱింగి శయనాసనాటన
మజ్జనదర్శనస్నానస్పర్శనాఘ్రాణభోజనశ్రవణాదిగుణంబుల నంగీక
రింపని విద్వాంసుండు ముక్తుండగు. మఱియును.

260


సీ.

పగగొని పఱదెంచు పశుఘాతకునియందుఁ
        బూజ సేయఁగ వచ్చు పుణ్యునందు
రోషహర్షంబులు రూఢిగా వర్జించి
        సర్వమానవులందు సమతఁ బొందిఁ
నెలకొని పరులపై నిందాస్తుతులు మాని
        పరపదార్థంబుల వాంఛ విడిచి
అర్థితోఁ బుత్రదారాదిమోహంబుల
        దిగనాడి మదిలోనఁ దెల్వి గల్గి


గీ.

శబ్దమయమైన బ్రహ్మంబుఁ జక్క నెఱిఁగి
తద్గతస్వాంతుఁ డగుచు నత్యాదరమున
బాహ్యమంతయు మఱచి యభ్యంతరమున
సంతసంబందు వరయోగి సంతతంబు.

261