పుట:భాగవతము - ఏకాదశస్కంధము (హరిభట్టు).pdf/61

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకాదశస్కంధము

61


సీ.

గుణములు కర్మమార్గోన్నతిఁ బుట్టించు
        గుణములు సృజియించు గుణగణంబు
గనుక నీజీవుండు గుణసమాకాంతుఁడై
        బలిమిఁ గర్మఫలానుభవము సేయు
వరుసతోఁ దద్గుణవైషమ్య మెందాకఁ
        నందాక నానాత్వ మాత్మయందు
నానాత్వ మెందాఁక నంతపర్యంతంబుఁ
        బారతంత్ర్యంబునఁ బ్రబలియుండు


గీ.

జీవుఁ డెందాఁక స్వాతంత్ర్యభావమందు
నంతపర్యంత మాదినాయకునివలన
భయము గలదని నరుఁడు తత్వంబుఁ దెలిసి
వేడ్కతోడుత నన్ను సేవింపవలయు.

255


వ.

ఇవ్విధంబున వాసుదేవుం డానతిచ్చినఁ బ్రియసేవకుండగు నుద్ధవుఁ
డిట్లనియె.

256


ఆ.

అరయ దేహజంబులైనట్టి గుణముల
యందు వర్తమానుఁడైన దేహి
తద్గుణంబుచేతఁ దద్దయు దృఢబద్ధు
డగునొ కాదొ నాకు నానతిమ్ము.

257


క.

ఏవిధమున లక్షితుఁడగు
నేవిధమునఁ గ్రీడ సేయు నేవి భుజించున్
ఏవిధమునఁ జరియించును
జీవుఁడు గుణబద్ధు డగుచుఁ జిత్రచరిత్రా.

258


శా.

విద్యావిద్యలు నా శరీరములుగా వీక్షించి యీ రెంటిలో
నాద్యంబై తనరారుచున్నయది మోక్షాధ్వంబుగాఁ జూడుమా
విద్యానామకమైన వస్తువది సద్విజ్ఞానరూపంబు, త
ద్విద్యాన్యం బపవర్గబంధకరమై వేధించు సుజ్ఞానమున్.

259