పుట:భాగవతము - ఏకాదశస్కంధము (హరిభట్టు).pdf/6

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

భాగవతము


విట్టిరూపంబు వాఁడని యెట్లు నిన్ను
నిశ్చయముతోడఁ దెలియంగ నేరనగునె
వామనాచ్యుత గోవింద వాసుదేవ
నీమహత్త్వము నేము వర్ణింపఁగలమె.

22


సీ.

నీ నామకీర్తన నిఖిలమర్త్యస్తోమ
        పాపతూలాహార్య పవనసఖుఁడు
నీ పాద యుగభక్తి నిర్మలకమలాల
        యాకర్షణంబున కాశ్రయంబు
నీగుణశ్రవణంబు నిబిడజన్మార్జిక
        కర్మపాశచ్ఛేద కర్తరగును
భవదీయసద్భక్త పదసేవ ముక్తికి
        బాటయేర్పఱుచు చొప్పరి ముకుంద
సర్వపరిపూర్ణ సర్వేశ సర్వతుల్య
నీ నిజాకార మిట్లని నిర్ణయింప
నెమ్మితోడుత వర్ణింప నిర్జరేంద్ర
హరవిరించాదులకునైన నలవియగునె?

23


క.

శ్రీనాయక నీనామము
నానావిధకర్మరోగనాశమునకు వి
న్నాణంబగు నౌషధ మిది
గానరు దుష్టాత్ము లకట! కంజదళాక్షా!

24


వ.

అని సన్నుతించిన మునివరుల వీక్షించి వసుదేవకుమారుం డిట్లనియె.


మ.

భవరోగఘ్నము లిందుశేఖరహరిబ్రహ్మాది ధార్యంబు లు
త్సవసన్మంగళకారణంబు లొగి సంతాపఘ్నముల్ నిత్యసం
భవపాపచ్ఛిదముల్ జయప్రదము లెప్పాటన్ మఱెల్లప్పుడున్
భవదీయాంఘ్రిసరోజసంజనిత విభ్రాజద్రజఃపుంజముల్.

25