పుట:భాగవతము - ఏకాదశస్కంధము (హరిభట్టు).pdf/5

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకాదశస్కంధము

5


అభ్యంతరనిలయ చతుర్దశభువన పరిపూర్ణుండును పూర్ణాబ్జమండల
స్వచ్ఛకపోలస్థల విలంబమాన మకరకుండల ద్వయదీప్త శ్యామ
లలితకంబుకంధరుండును కంధరపోత నికరశ్యామల నిజాకారభాసు
రుండును సురనికరమౌళిరత్న నానావిధరంజిత పాదాభిరాముండును
నిజకిరీట సముల్లసద్గారుత్మతమణి సహస్రద్యుతి పిశంగీకృత నిజాస్థాన
ప్రదేశుండును కరుణారస పరిపూర్ణ కటాక్షవీక్షాసముజ్జ్వలుండును
శంఖచక్రగదాసిశార్ఙాద్యుదాయుధధరుండును మదనకోటిలావణ్య దేదీ
ప్యమానుఁడునునైన యప్పుండరీకాక్షుం గనుంగొని తత్సమర్పితసవిన
యార్ఘ్యపాద్యంబు లంగీకరించి హేమాసనసమాసీనులై మునివరులు
వాసుదేవసమ్ముఖంబున నిట్లనిరి.

19


క.

దలమయిన కలుషజాతము
దొలఁగును భాగ్యంబులెల్ల దూకొనఁగలిగిన్
ఫలియించెను మాతపములు
ఫలములు నేఁ డంబుజాతపత్త్రశుభాక్షా.

20


చ.

కలిగెను నేడు భాగ్యములు కంటిమి నీపదపద్మయుగ్మమున్
బొలిసెను పాపసంఘములు పోయె నవిద్య సమస్తయోగి హృ
జ్జలరుహ మధ్యవర్తి వగు శాశ్వతమౌ నిజమూర్తి నిచ్చటన్
నెలకొని చూడఁగల్గె నిదె నిర్మలమైన విలోచనంబులన్.

21


సీ.

ఒకవేళఁ బరమాణువులకన్న మిక్కిలి
        సూక్ష్మరూపము దాల్చి సూక్ష్మమగుదు
వొకవేళ విభురూప మొనరించి వేడ్కతో
        విశ్వంభరుండవై వెలయుచుందు
వొకవేళ సగుణంబు నొంది రుద్రాదులు
        వినుతింపనుందువు విమలచరిత
యొకవేళ నిర్గుణయుక్తమై యోగీంద్ర
        మానసంబులయందె కానఁబడుదు