పుట:భాగవతము - ఏకాదశస్కంధము (హరిభట్టు).pdf/48

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

ఏకాదశస్కంధము


ఉ.

దారలయందు పుత్రధనధాన్యములందు ననేకభంగులన్
గూరిమిఁ జేసి మర్త్యుఁ డతిఘోరవియోగజదుఃఖమగ్నుఁడై
నేరుపు దక్కి చిక్కువడి నీతివివేకవిహీనుఁడై మహా
భారముతోఁ గపోతమను పక్షివిధంబునఁ బోవు నష్టమై.

202


వ.

అది యెట్లన్న.

203


సీ.

ఎలమి నవ్వనములోపలఁ గపోతం బొక్కఁ
        డనుకూలభార్యాసహాయుఁ డగుచు
ననువుతో భూరుహంబున గూడు నిర్మించి
        మేలిమియగు మేత మేసి యందు
గరిమ నన్యోన్యాంగకముల సంస్పర్శన
        మాచరించుచుఁ జిత్తమందుఁగూర్మి
సలుపుచు నేప్రొద్దు సంతసంబును బొంది
        గొనకొని విహరింపఁ గొంతకాల
మునకుఁ గాంచెనుఁ దత్పత్ని ముదముతోడ
నండములు మూడుఁ నాల్గింటి నవియుఁ గొన్ని
యహరహంబుల కవిసి సర్వాంగకములు
లావుసమకూరి పిల్లలై లేవఁ బొదలె.

204


ఉ.

అరయ నొక్కనాఁడు వనమందుఁ జరింపుచు లుబ్ధకుండు నా
భూరుహ మెక్కి పక్షు లటువోవఁగఁ జూచి తదీయమాంసవాం
ఛారమితాత్ముఁడై మిగులసంతస మందుచు గూటివాకిటన్
నూరువిధంబులౌనురుల నూఁది తలంగిన యంతలోపలన్.

205


గీ.

కడుపునిండ మేసి కవగూడి మున్నాడి
వచ్చి పతగకాంత వైపుదప్పి
యురులలోనఁ జిక్కి యున్నట్టి పిల్లలఁ
జేరబోవ దాన చిక్కువడియె.

206