పుట:భాగవతము - ఏకాదశస్కంధము (హరిభట్టు).pdf/47

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకాదశస్కంధము

47


క.

ఆయాకాశము విభువై
వాయుసహాయంబులైన వనదంబులచే
నేయెడ లిప్తముగా వె
ట్లాయోగి చరింపవలయు నగుణస్థుండై.

195


గీ.

స్నిగ్ధమధురయుక్తజీవనంబులరీతి
నరుల యోగి పావనంబు సేయు
ప్రేక్షణంబుచేతఁ బృథుకరస్పర్శచే
నయము మీఱఁ గీర్తనంబుచేత.

196


గీ.

కాంతి గలిగి తపము కతన సందీప్తుఁడై
యుదరభాజనత్వ ముడుగ కెపుడు
సర్వభక్షుఁడైన సప్తజిహ్వునిభాతి
నిర్మలాత్ముఁ డగుచు నిలువవలయు.

197


క.

అజమాయాసృష్టంబగు
త్రిజగంబునఁ గలసి సర్వదివ్యాకృతియై
యజరామరణుండై పం
కజనాభుఁడు సమిధ నగ్నికరణి వసించున్.

198


శా.

భావింప న్ప్రభవాప్యయాదులగు నీభావంబు లెల్లప్పుడున్
దేవాధీశునకైన దేహగుణముల్ దేహుబు పడ్డప్పుడే
జీవుం డన్యశరీరమధ్యగతుఁడై చేష్టావశస్వాంగుఁడై
జీవించున్ యతిసూక్ష్ముఁడై తనరురాజీవారచందంబునన్.

199


క.

ఈచందంబున దేహం
బాచంద్రార్కంబు నిల్వ దని యెఱిఁగి మదిన్
యోచింపక యోగీంద్రుఁడు
భూచరణము సేయవలయుఁ బొదలిన వేడ్కన్.

200


మ.

తిరమై భూరుహగుల్మపర్వతజలాదివ్యక్తిసంక్రాంతుఁడై
పరిపూర్ణుండగు నాత్మఁదద్గతునిగా భావింతు రజ్ఞుల్ సము
ద్ధురసుజ్ఞానపరాయణుల్ తదితరస్ధుల్ గా విచారించి వే
మఱు సప్తాశ్వునిరీతిఁ జూతురు మనోమార్గంబుచే నిత్యమున్.

201