పుట:భాగవతము - ఏకాదశస్కంధము (హరిభట్టు).pdf/46

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

ఏకాదశస్కంధము


వ.

విను మిక నీ వడిగిన వచనంబులకు సవిస్తరంబుగా నుత్తరంబు
చెప్పెద; భూమియు ననిలంబును, నాకసంబును, ననలంబును కళా
నిధియును, భానుండును, కపోతంబును నజగరంబును సముద్రంబును
శలభంబును, ద్విరేఫంబును, గజంబును, మధుమక్షికయు, హరిణం
బును, మత్స్యంబును, పింగళయును, కమతంబును, బాలకుండును,
కుమారికయును, శరాకారుండును, సర్పంబును, నూర్ణనాభియు,
కణుందుటీఁగయు ననఁబఱగువీని వలన నొక్కొకగుణం బంగీకరించి
పుత్రదారాది మోహంబు విసర్జించి జగం బనిత్యంబుగాఁ దలంచి
పరమపదనివాసంబు కొఆకునై హరినామస్మరణంబు సేయుచు
వసుధాతలంబున సంచరింతు నది యెట్లనిన.

190


గీ.

భూతధాత్రిభంగి భూతావృతుండయ్యు
దనమనంబులోన ధైర్య మొదవ
సత్త్వమార్గమందుఁ జలన మించుకలేక
చనునతండు సత్యసమ్మతుండు.

191


క.

పరిమళము దెచ్చి వాయువు
పరులకు సౌఖ్యంబు జేయు పగిదిఁ బరార్థ
స్థిరచిత్తుఁడగుచు వాంఛా
విరహితుఁ డగువాడె యోగి వీక్షింపంగన్.

192


గీ.

అరయఁ బార్థివంబు లైనట్టి దేహంబు
లందు జొచ్చి తద్గుణాశ్రయుండు
నగుచు వానిగూడి యలసి తిరుగక యాత్మ
నాత్మతోడఁ గూర్చు నతఁడె యోగి.

193


క.

అరయఁగ నంతర్బహిరా
వరణంబులయందు జీవవర్గములందున్
బరము విధంబున నాత్మను
బరిపూర్ణునిగానెఱుంగు భావమువలనన్.

194