పుట:భాగవతము - ఏకాదశస్కంధము (హరిభట్టు).pdf/40

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

ఏకాదశస్కంధము


ఆ.

పయనమునను వృష్ణిబలములఁ బరికించి
యుద్ధవుండు యోగయుక్తుఁ డగుచు
వేగ నరుగుదెంచి విష్ణు నీక్షణఁ జేసి
పాదయుగము నెరఁగి పలికె నతఁడు.

163


సీ.

సర్వగ సర్వేశ సర్వజ్ఞ సన్నుత
        సచ్చిదానంద విశ్వాధినాథ
సాహసాహితచక్రసంహార సరసీరు
        హాయతేక్షణ ఘనాద్యంతశూన్య
సనకాదియోగీంద్రచారుమానసపద్మ
        నిలయాతినిర్మల నిర్వికార
కంసచాణూరాది ఖండనాఖండల
        ప్రముఖవందితలసత్పాదయుగళ
సకలలోకైకనాయక చక్రహస్త
కోటిమన్మథసమరూప కుంభినీశ
వామనాచ్యుత గోవింద వాసుదేవ
నిన్నుఁ దలఁచెద నేపొద్దు నిత్యచరిత.

164


సీ.

దేవ యోగీశ్వర దేవేశ నీవిట
        సకలయాదవబలక్షయముఁ జేసి
మహిమీఁద నిలయంబు మాని కైవల్యంబుఁ
        బొందుచున్నాఁడవు భువనవంద్య
నిశ్చయం బిది నేను నీపాదయుగళంబుఁ
        బాసి యుండఁగలేను భవ్యరూప
కొనిపొమ్ము నీపదంబునకు న న్నచ్యుత
        నీక్రీడ నరులకు నిఖిలపుణ్య
కారణముగాన వినుతించు ఘనులు దివ్య
లోకములఁ బొందుదురు పద్మలోచనాఢ్య
చతురతశయ్యాసనాటన స్నానభోజ
నాదులందును విడువలే ననఘ నిన్ను.

165