పుట:భాగవతము - ఏకాదశస్కంధము (హరిభట్టు).pdf/4

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

భాగవతము


హరి మాన్పలేఁడయ్యె నఖిలలోకేశ్వరుఁ
        డతనికి సమ్మతంబయ్యె నెట్లు
యే మూలమున వచ్చె నీశాపకాలాగ్ని
        నేరీతి హతమయ్యె నీబలంబు
నిట్టి వృత్తాంతమంతయు నేర్పడంగ
విమలవాక్ప్రౌఢితోడుత విస్తరించి
శ్రవణపుటయుగ్మమునకు నుత్సాహ మొదవ
నఖిలమునిలోకవంద్య నా కానతిమ్ము.

15


వ.

అవి పలికిన నరపాలపుంగవునకు యతిపుంగవుం డిట్లనియె.

16


క.

విను భూపాలక యాకథ
వినిపించెద మనములోన వేడుక పుట్టన్
ఘనతర మద్వాగ్విభవం
బునఁ దోచినకొలది నధిక మోదముతోడన్.

17


క.

నిరుపమసుందరదేహము
ధరియించి సమస్తకర్మతత్పరుఁడై యా
చరణంబుచేసి ధర్మము
హరి మనమునఁ దలచె నణఁప యాదవబలమున్.

18


వ.

ఆసమయంబున జటావల్కల జపమాలాదండకమండలు సహితు
లైన విశ్వామిత్ర, అశిత, కణ్వ, భృగ్వాంగీరస, కశ్యప, వామదేవ,
అత్రి, వసిష్ఠ నారదాది మునివరులు స్వేచ్ఛావిహారంబున, ద్వారకా
నగరంబున కరుగుదెంచి, యందు మంజుశింజానమంజీర కీలిత వివిధ
రత్నకాంతిచ్ఛటాపుంజ పింజరిత పాదాంబుజాత యుగళుండును
ఝణ ఝణత్కార ముఖర రత్న ఘంటికాసమంచిత కటిస్థల విరాజ
మాన పీతాంబరాలంకృతుండును నానావిధరత్నహార దేదీప్యమాన
వక్షస్స్థల నిత్యనివాస లక్ష్మీసమాలోకన స్మితముఖాంబుజాతుండును
అంబుజాత సమానకరకంకణ క్రేంకార సంకుల దశదిశాభ్యంతరుండును