పుట:భాగవతము - ఏకాదశస్కంధము (హరిభట్టు).pdf/38

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

ఏకాదశస్కంధము


సీ.

యదుమహావంశమం దవతరించిన నీవు
        దివ్యతేజంబునఁ దేజరిల్లు
వెరవున నుద్దామ వృత్తకర్మంబుల
        నఖిలరక్షణకునై యాచరించి
జగములు నిలిపితి సజ్జనుల్ కలియందు
        నీనామకీర్తన నెమ్మిఁజేసి
సత్పథంబునకునై చనుదు రుజ్జ్వలరూప
        మేదిని నీవు జన్మించి నూట
యిరువదేవగు వర్షమ్ము లిచటఁ జనియె
నమరకార్యంబు సాధితం బయ్యె విప్ర
శాపమున స్రుక్కి యాదవుల్ సమయువారు
పరమపదవీథి జను మింక పద్మనయన!

154


వ.

అని యివ్విధంబునఁ బంకజాసనాదిబృందారకసంఘంబు లమంద
హర్షంబున ననేకధముల సన్నుతించిన వారలం జూచి వాసుదేవుం
డిట్లనియె.

155


చ.

ఎఱుఁగుదుఁ జిత్తమందు విబుధేశ్వరు లిక్కడిరాక మున్ను నే
ధరణిభరంబు మాన్ప ఘనదానవులన్ వధియించినాఁడ దు
ష్కరమదగర్వసంపదలఁ గన్నులుగానని యాదవక్షమా
వరులను నేపడంచి యిదె వచ్చెడ ముక్తికి సత్వరంబునన్.

156


క.

వీరి వధింపక యేఁ జన
వారిధి దన మేరదప్పి వచ్చినక్రియ దు
ర్వారులగు యాదవులచే
భారంబగు దిరుగ భూమి భాగంబునకున్.

157


క.

అని పలికి వాసుదేవుం
డనిపిన జలజాతపద్భవాదులు వేడ్కన్
జనిరి నిజాలయములకును
మనమునఁ దత్పాదభక్తి మఱువక భూపా.

158