పుట:భాగవతము - ఏకాదశస్కంధము (హరిభట్టు).pdf/35

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకాదశస్కంధము

35


గీ.

భూమిపతులఁ జంపి భూభార మొగి మాన్పఁ
బంచి సుజనరక్షణంబుకొఱకు
నవతరించి కృష్ణుఁ డమరులు వొగడఁగ
నిలిపెఁ గీర్తి దిశల నెమ్మితోడ.

144


వ.

ఇట్లా నారదుండు భగవద్భక్తికరంబులగు జయంతోపాఖ్యానంబుఁ
జెప్పిన విని విస్మయంబంది దేవకీవసుదేవులు వాసుదేవునందుఁ
బుత్రమోహంబు విసర్జించి, పరమాత్మగాఁ దలంచుచు వర్తించి రని
శుకయోగీంద్రుఁ డానతిచ్చిన విని పరీక్షిన్నరపాలపుంగవుం డిట్లనియె.

145


గీ.

ఏమిచేసె కృష్ణుఁ డిటమీఁద యదువుల
నేవిధంబు తోడ నే పడంచె
భక్తజనులచేతఁ బ్రార్థితంబైనట్టి
పదము నెట్లు వొందె భవ్యచరిత.

146


వ.

అని పలికిన రాజవరునకు యతివరుం డిట్లనియె.

147


సీ.

మునిగణంబులతోడ మొనసిన బ్రహ్మయు
        గణములు గొలున శంకరుఁడు దేవ
బృందంబుతోనఁ ద్రిభేదనుం డాదిత్యు
        లశ్వినుల్ వసువులు నంగిరసులు
ఋభువు లప్సరసలు రుద్రులు సాధ్యులు
        గంధర్వసిద్ధనాగమునులఁ గూడి
కింపురుషుల్ పితృకిన్నరవర్గముల్
        సంఘమై కృష్ణ దర్శనముఁ గోరి
ధరణి దివములఁ గల పదార్థములచేతఁ
బొలుపు మీఱుచు విభవసంపూర్ణమైన
ద్వారకాపురి దేవకీతనయుఁడైన
విష్ణుఁ గాంచిరి వేదాంతవేద్యు నచట.

148