పుట:భాగవతము - ఏకాదశస్కంధము (హరిభట్టు).pdf/16

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

భాగవతము


ఏనరుండైన నర్థంబు లింద్రియముల
చేత గ్రహించియును సర్వజాతులందుఁ
గ్రమము దప్పక యొక్కమై సమముగాను
యోగమును జూచు నాతఁడ భాగవతుఁడు.

65


సీ.

అనయంబు దేహేంద్రియప్రాణహృద్బుద్ధు
        లకు నేవి గాలంబు ప్రకటమగుచు
సొరిది జన్మాప్యయక్షుద్భయతర్షాది
        బహుళసంసార సంభవములైన
యట్టి ధర్మములచే నవిముహ్యమానుఁడై
        కర్మకామంబుల కాశ్రయంబు
గాక జన్మాదికకర్మ వర్ణాశ్రమ
        జాతివర్గంబులచేతఁ జెడక
స్వపరవిత్తాత్మభేదంబు సలుప కఖిల
భూతములయందు సమమైన బుద్ధి కలిగి
పరమపురుషుని పాదాబ్జభక్తిఁ దనరు
పరమపుణ్యుఁడు వాడువో భాగవతుఁడు.

66


వ.

మఱియు సస్యస్త సకల కర్మారంభుండై యఖిలజీవవత్సలుఁడైన
పరమేశ్వరభక్తుండు బాలభాస్కరుండు కిరణరేణుచయంబుచే లోక
త్రయంబును బావనంబు సేయుచందంబున నతండు నిజపాద జనిత
రజఃపుంజంబులచేత జగంబు పవిత్రంబు సేయుచు సురాసుర మృగ్యం
బైన భగవత్పాదారవిందంబుల భక్తి వలన లవమాత్రంబును జలిం
పక చంద్రోదయంబున భాస్కరజనిత తాపనివారణం బగుచందం
బున భగవత్పాదాంగుళి నఖమణి చంద్రికా నిరసితహృదయ
తాపుండై యాత్మీయభక్తికతన వాసుదేవాంఘ్రిసరోరుహంబు
గలుగునతండు భాగవత ప్రధానుండని యెఱింగించిన విని విదేహుం
డిట్లనియె.

67