పుట:భాగవతము - ఏకాదశస్కంధము (హరిభట్టు).pdf/15

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకాదశస్కంధము

15


మ.

అనయంబున్ హరిజన్మకర్మకథలన్ హర్షంబుతో వీనులన్
వినియుం బాడుచు నాడుచున్ వ్రతముతో విశ్వంబులో సంచరిం
పను లజ్జింపక లోకబాహ్యుఁడగుచున్ భావంబులో నవ్వుచున్
ఘనతత్పాదకృతానురాగుఁడగుచున్ గాంతారదేశంబులం
దునె వర్తించును వెఱ్ఱివానిక్రియఁ దుల్యోత్సాహసంపన్నుఁడై.

61


వ.

మఱియు నాకాశంబును వాయువును నగ్నిసలిలంబులను ధర
ణిని తేజంబును దేశంబులను మహీరుహంబులను నదులను సముద్రంబు
లను నారాయణశరీరంబుగా విచారించి భేదంబు సేయని ప్రసన్ను
నికి భుజియించెడివానికి నొక్కకాలంబునం దతుష్టియు, క్షుధా
పాయంబునునైన చందంబున భక్తియుఁ బరేశానుభవంబు నన్యత్ర
విరక్తియుం గలుగు; నిట్లచ్యుతాంఘ్రిసేవాపరుండై భాగవతుండు
సాక్షాత్కారంబునంద వసియించు నని వారి భక్తిప్రకారంబు
చెప్పిన విని విదేహుం డిట్లనియె.

62


ఆ.

వరుసతోడ భాగవతధర్మ మెద్ది చ
ర్చింప భాగవతుల చిహ్న లెవ్వి
అతఁడ యేమి పలుకు నాచరించునొ యెద్ది
చెలఁగి యెట్టికథలు చెప్పవలయు.

63


వ.

ఇట్లు విదేహుం డడిగిన నందు హరియను మహాత్ముం డిట్లనియె.

64


సీ.

సర్వభూతములందు సర్వేశుభావంబు
        సర్వేశునందును సర్వభూత
భావంబు నొనరించుఁ బరమభాగవతుండు
        ఉత్తమోత్తముఁడన నుర్వి వెలయు
పరమేశ తదధీన బాలిశరిపులందు
        ప్రేమమైత్రియు గృపాపేక్ష లొసఁగు
నతఁడు మధ్యముఁడగు నర్చావతార స
        ద్భక్తిసంయుక్తుండు ప్రాకృతుండు