పుట:భాగవతము - ఏకాదశస్కంధము (హరిభట్టు).pdf/1

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ
భాగవతము
హరిభట్టారకప్రణీతము

ఏకాదశస్కంధము


శా.

శ్రీ రాజత్కుచకుంభ యుగ్మ నిహిత శ్రీగంధ సంవాసితో
దార స్వీయభుజాంతరాళ విచలద్రత్నప్రభారంజితున్
కారుణ్యైక నివాసు వాసవపయోనాథాదిసంసేవితున్
గారావంబున సన్నుతింతుఁ ద్రిజగత్కళ్యాణమూర్తిన్ హరిన్.

1


క.

మనమున రఘునాయక పద
వనరుహ యుగళంబు దలఁచి వైభవలీలన్
దినదినము హర్ష మందెడి
హనుమంతుని సన్నుతింతు ననురాగమునన్.

2


సీ.

గురుతరమాణిక్య కుండలద్వయదీప్తి
        మండితగండ యుగ్మంబు వాని
బాలభానుప్రభా భాసుర సంరక్త
        సలలిత వక్త్రాంబుజంబువాని
కాంచనశైల సంకాశదేహమున య
        జ్ఞోపవీతంబు చెన్నొందువాని
కౌపీనమేఖలా కలితకటిస్థల
        స్థాపితపుష్పగుచ్ఛములవాని
వాలరోమాగ్ర నిర్బిన్న వారివాహ
సంఘనిష్ఠుర నిర్దోష చలితభువన
నిర్జితేంద్రాది సన్నుత నిజచరిత్రు
బాహుబలవంతు హనుమంతుఁ బ్రస్తుతింతు.

3