పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/517

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ము, దత్తాత్రేయశతకము, శివజ్ఞానమంజరి (ద్విపద), ఉత్తరగీతవ్యాఖ్య రచించెను. పరమానందతీర్థుఁడు దత్తాత్రేయగురువర్యుని శిష్యుఁడు. ఉభయభాషాకవితావిభవము గలవాఁడు. ఈశతకమునందుఁ జెప్పఁబడిన సంపఁగిమన్నఁ డెవరో యాతనిప్రభావాదిక మెట్టిదో గుఱుతింప వీలుచిక్కదు. పరమానందయతికివలెనే పదునాఱవశతాబ్దమున నున్న తరిగొప్పుల మల్లనకవి దత్తాత్రేయుఁడు గురుఁడుగాన నీయిరువురు నొకశతాబ్దమువారె యని యూహసేయ వీలగుచున్నది. లక్షణగ్రంథములలో నీపరమానందయోగి శతకము లుదాహరింపఁబడకపోవుటచే నీకాలనిర్ణయ మెంతనిశ్చయమో తెలుప వీలులేదు. ఇందలి పద్యములు చక్కని గమనికలతోఁ గూరుపుబింకములతోఁ గల్పనాచమత్కారములతో మిగులమనోహరముగ నున్నవి. వేదాంతవిషయగర్భితముగు నింత మృదుమధురధారలోఁ గవిత చెప్పుట సామాన్యము కాదు. పరమానందయోగి వేదాంతవిషయికవిజ్ఞానమున నెంతవాఁడో గాని కవితాప్రగల్భతలో మాత్రము నేర్పరి యనుటకు సందియము లేదు. ఇందును వ్యాకరణస్ఖాలిత్యములు కొన్నిచోటుల గలవు.