పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/494

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

ఈ రామరామశతకము నూటాఱు చరణములు గల యొక గేయము. ఇది నారాయణశతకమువలెఁ బాడుట కనుకూలముగ సులభశైలిలో మనోహరముగా రచింపఁబడియున్నది. శతకరచయిత తోట నరసింహదాసు విఱుకలాంబలకుఁ గుమారుఁడగు వేంకటనరసింహకవి ఇతనివాసము కుల్లూరనియు చిన్ననాగయ్యదాసుగారి శిష్యుడనియు నంత్యము గల చరణములవలనఁ దెలియును, కుల్లూ రెటఁగలదో చిననాగయ్యదాసునిప్రశస్తి యెట్టిదో తెలిసికొనవలసియున్నది.

కవి యీశతకమును శుక్లసంవత్సరము మార్లశిర బహుళ గురువారమున వ్రాసితినని చెప్పికొనెను. శతాబ్దము తెలుపుకొనకపోవుటచే నే శుక్లయో గుఱుతింప వీలు గాకున్నది. తిథియు వారమును జెప్పికొనిన కవికాలము గ్రహింపఁ గొంతవఱకు వీలయ్యెడిది. ఎటులఁ జూచినను కవి అఱువదిసంవత్సరములకుఁ బైవాఁడనియు శతకగద్యమువలన మనము స్థూలదృష్టితో నిరూపింపవచ్చును.