పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/485

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48. క. నలుగురి నొక్కటిఁ జేసిన
నలుగురిలో బ్రతుకవచ్చు నాణెముగాఁ దా
నలుగురిపనులకుఁ దిరిగిన
ఫల మంటదు శివముకుంద పరమానందా.

49. క. నలుగురిలోఁ దలవంచుక
నలుగురిలోఁ గూడి మాడి నడువక వేఱై
పలుపోకలఁ దిరుగును ఛీ!
బలహీనుఁడు శివముకుంద పరమానందా.

50. క. నలుగురికిం దా గుఱియై
మెలఁగిన నది ముక్తిగతికి మేలై రాదే
నలుగురితో గూడనిదే
పలుచనయా శివముకుంద పరమానందా.

51. క. తనయింటం దా నుండినఁ
దనయిల్లే తనకుఁ జేటు దాఁ దెచ్చునయా
తనయిల్లు కాలవేసిన
పనిమే లది శివముకుంద పరమానందా.

52. క. అద్దిర యనుభవ మెఱుఁగక
వద్దనువా రెవరు లేక వదరుచుఁ దిరిగే
పెద్దలసుద్దులు గిద్దులు
బద్దలునా శివముకుంద పరమానందా.

53. క. తలఁపు చెడఁ గర్మములు చెడుఁ
దలఁపు చెడన్‌ మాయ చెడును దా ననుట చెడున్‌
తలఁపు చెడినతఁడె ముక్తికి
బలవంతుఁడు శివముకుంద పరమానందా.

54. క. భావంబుఁ దలఁచుటెల్ల న
భావము తలఁపుడుగు టెల్లఁ బన్నుగ భావా
భావాతీతము సహజము
పావన మది శివముకుంద పరమానందా.