పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/480

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

13. క. కొందఱు తత్త్వపుమాటల
సందడిఁ బడి తెలిసినట్ల సద్గురుకృప లే
కుందు రనుభూతిఁ గానని
పందలవలె శివముకుంద పరమానందా.

14. క. తాఁటాకులు ద్రిప్పుచు పది
కోటులు చదువంగ నేమి గురువాక్యంబుల్‌
పాటించి తెలియ కది యే
ర్పా టౌనా శివముకుంద పరమానందా.

15. క. నిజమైన ముక్తికొఱకై
సుజనుఁడు సద్గురుని వెదకి సుస్థిరమతి యై
భజియింపక గలదే గతి
ప్రజలకు నిఁక శివముకుంద పరమానందా.

16. క. గురుభజనఁ బాపములు చెడు
గురుభజనను గర్మ ముడుగుఁ గోరిక లుడుగుం
గురుభజన ముక్తికర మగు
పరమాత్మా శివముకుంద పరమానందా.

17. క. నాటిన యామిక విడిచి ప
టాటోపము లేక నమ్రుఁడై గురుభజం
బాటించక ననుభవ మే
ర్పా టౌనా శివముకుంద పరమానందా.

18. క. ఆదట గురుమతమున దే
హాదులఁ దొలఁగంగ నేర్చునాతని మదిలో
పో దిఁక సహజానందము
పాదుకొనున్‌ శివముకుంద పరమానందా.

19. క. వినినప్పుడె కనవచ్చును
యనుభవి యౌ యోగివాక్య మాదరమునఁ దా
వినఁగూడని యహమికఁచే
బనుపడ దది శివముకుంద పరమానందా.