పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/463

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20. తనకు దేహాభిమానంబు తఱిఁగెనేని
మాయసంసార మప్పుడే మాయ మయ్యె;
మాయరూపంబులే నష్టమాయె మాయ,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

21. అతిరహస్యము మఱిబయ లనఁగ వినియుఁ
దెలియఁజాల రదేమొకో తేటపడఁగ?
మాయ బలమైగదా యిట్లు మఱుఁగుచేసె,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

22. మనసు మాయని తానును మచ్చికాయె;
మనసు మాయగదా యన మాయ మాయె;
అందు నేమాయె? సత్తె యానంద మాయె;
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

23. గాలి నిలిచినఁ గలదండ్రు కాయసిద్ధి;
కాయమును గాలియును రెండు మాయ గాదె?
కాయ సిద్ధౌట తత్త్వంబుఁ గనుట కాదె?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

24. కాయ సిద్ధైనవారినిఁ గన్నవారు
నున్నవారును గలరె యీ యుర్విలోనఁ?
గాయ సిద్ధులు తొల్లింటికథలు సువ్వె,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

25. తనువు గలుగుట ప్రారబ్ధ మనుభవింప
ననుభవము దీఱి నిశ్శేష మైనవెనుక;
కాయసిద్ధికిఁ బడుపాటు గాలిఁబోదె,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

26. గరికివేళ్లును నీళ్లును గాయకసరు
నాకటికిఁ దిన్నఁ గాయసిద్ధౌటయెట్లు?
మనుజు లి ట్లేల వెఱ్ఱులై మరులుకొనిరి?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.