పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/36

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కూపంబులో
నలరం ద్రిమ్మరుచుండు నన్ను నకటా! యార్తుండనై వేఁడెదన్‌
వెలయ న్నీకృపచేతఁ జేకొనవె నన్‌ వేవేగ నారాయణా! 83

మ. మమహంకార వికారసన్నిభ మహామత్తాది లోభాంధకా
రముచే ముక్తికి నేఁగుమార్గ మెఱుగన్‌ రా దింక నాలోన నీ
విమలాపాంగ దయా దివాకరరుచిన్‌ వెల్గింపు మింపార నో
కమలానంద విహారవక్షలలితా! కంజాక్ష! నారాయణా! 84

మ. పరిపంధిక్రియ నొత్తి వెంటఁ బడునప్పాపంబుఁ దూలించి మీ
చరణాబ్జస్థితి పంజరంబు శరణేచ్ఛం జొచ్చితిం గావుమీ
బిరుదుం జూడుము మీరు సూడఁగ భవద్భృత్యుండు దుఃఖంబులం
బొరయ న్నీ కపకీర్తి గాదె శరదంభోజాక్ష నారాయణా! 85

మ. సతతాచారము సూనృతంబు కృపయున్‌ సత్యంబునున్‌ శీలమున్‌
నతిశాంతత్వము చిత్తశుద్ధికరము న్నధ్యాత్మయున్‌ ధ్యానమున్‌
ధృతియున్‌ ధర్మము సర్వజీవహితముం దూరంబు గాకుండ స
మ్మతికిం జేరువ మీనివాససుఖమున్‌ మానాథ నారాయణా! 86

మ. భవనాశిన్‌ గయ తుంగభద్ర యమునన్‌ భాగీరథిం గృష్ణ వే
త్రవతి న్నర్మద పెన్న గౌతమి పయోరాశి న్వియద్గంగ యం
దవగాహంబున నైన