పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/310

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గలిమికొలదిగఁ గానుకల నొసంగెద నన్న
భార్గవీదేవి నీ భార్యయయ్యె
తే. నన్ని గలవాఁడ వఖిల లోకాధిపతివి!
నీకు సొమ్ములు పెట్ట నేనెంతవాఁడ!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 92

సీ. నవ సరోజదళాక్ష! నన్నుఁ బోషించెడు
దాతవు నీవంచు ధైర్యపడితి
నా మనంబున నిన్ను నమ్మినందుకుఁ దండ్రి!
మేలు నా కొనరింపు నీలదేహ!
భళిభళీ! నీ యంత ప్రభువు నెక్కడఁ జూడఁ
బుడమిలో నీ పేరు పొగడవచ్చు
ముందుఁ జేసిన పాపమును నశింపఁగఁ జేసి
నిర్వహింపుము నన్ను నేర్పుతోడఁ
తే. బరమ సంతోషమాయె నా ప్రాణములకు
నీ ఋణము దీర్చుకొననేర నీరజాక్ష!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 93

సీ. ఫణుల పుట్టల మీఁదఁ బవ్వళించిన యట్లు
పులుల గుంపునఁ జేరఁబోయిన యట్లు
మకరి వర్గంబున్న మడుఁగుఁ జొచ్చినయట్లు
గంగ దాపున నిండ్లు గట్టినట్లు
చెదల భూమిని చెరగు చాఁప బఱచినయట్లు
ఓటిబిందెలఁ బాల నునిచినట్లు
వెఱ్ఱివానికిఁ బహువిత్త మిచ్చినయట్లు
కమ్మగుడిసె మందుఁ గాల్చినట్లు