పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/301

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తే. భక్తులకు నీవు పెట్టుట భాగ్యమౌను
వారి కాశించితివి తిండివాఁడ వగుచు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 72

సీ. స్తంభమం దుదయించి దానవేంద్రునిఁ ద్రుంచి
కరుణతోఁ బ్రహ్లాదుఁ గాచినావు
మకరిచేఁ జిక్కి సామజము దుఃఖించంగఁ
గృపయుంచి వేగ రక్షించినావు
శరణంచు నా విభీషణుఁడు నీ చాటున
వచ్చినప్పుడె లంక నిచ్చినావు
ఆ కుచేలుఁడు చేరెఁడటుకు లర్పించిన
బహుసంపదల నిచ్చి పంపినావు
తే. వారివలె నన్నుఁ బోషింప వశముగాదె?
యింత వలపక్ష మేల శ్రీకాంత! నీకు?
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 73

సీ. వ్యాసుఁడే కులమందు వాసిగా జన్మించె?
విదురుఁడే కులమందు వృద్ధిఁ బొందెఁ?
గర్ణుఁడే కులమందు ఘనముగా వర్ధిల్లె?
నా వసిష్ఠుం డెందు నవతరించె?
నింపుగా వాల్మీకి యే కులంబునఁ బుట్టె?
గుహుఁ డను పుణ్యుఁడే కులమువాఁడు?
శ్రీశుకుఁ డెచ్చటఁ జెలఁగి జన్మించెను?
శబరి యే కులమందు జన్మమొందె?
తే. నే కులంబున వీరంద ఱెచ్చినారు?
నీ కృపాపాత్రులకు జాతినీతు లేల?
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 74