పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/297

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీ. నాతండ్రి! నాదాత! నాయిష్టదైవమా!
నన్ను మన్నన సేయు నారసింహ!
దయయుంచు నామీఁద దప్పులన్ని క్షమించు
నిగమగోచర! నాకు నీవె దిక్కు
నే దురాత్ముఁడ నంచు నీ మనంబునఁ గోప
గింపఁ బోకుము స్వామి! యెంతకైన
ముక్తిదాయక నీకు మ్రొక్కినందుకు నన్నుఁ
గరుణించి రక్షించు కమలనాభ!
తే. దండిదొర వంచు నీ వెంటఁ దగిలినాను
నేఁడు ప్రత్యక్షమై నన్ను నిర్వహింపు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 64

సీ. వేమాఱు నీకథల్‌ వినుచు నుండెడివాఁడు
పరుల ముచ్చటమీఁద భ్రాంతిపడఁడు
అగణితంబుగ నిన్నుఁ బొగడ నేర్చినవాఁడు
చెడ్డమాటలు నోటఁ జెప్పఁబోఁడు
ఆసక్తిచేత నిన్ననుసరించెడివాఁడు
ధనమదాంధుల వెంటఁ దగులఁబోఁడు
సంతసంబున నిన్ను స్మరణఁ జేసెడివాఁడు
చెలఁగి నీచులపేరుఁ దలఁపఁబోఁడు
తే. నిన్ను నమ్మిన భక్తుండు నిశ్చయముగఁ
గోరి చిల్లరవేల్పులఁ గొల్వఁబోఁఁడు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 65

సీ. నే నెంత వేఁడిన నీకేల దయరాదు?
పలుమాఱు పిలిచినఁ బలుక వేమి?