పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/292

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీ. సాధు సజ్జనులతో జగడమాడినఁ గీడు
కవులతో వైరంబుఁ గాంచఁ గీడు
పరమ దీనులఁ జిక్కఁబట్టి కొట్టినఁ గీడు
భిక్షగాండ్రను దుఃఖపెట్టఁ గీడు
నిరుపేదలను జూచి నిందఁ జేసినఁ గీడు
పుణ్యవంతులఁ దిట్ట బొసఁగుఁ గీడు
సద్భక్తులను దిరస్కారమాడినఁ గీడు
గురుని ద్రవ్యము దోఁచుకొనినఁ గీడు
తే. దుష్టకార్యము లొనరించు దుర్జనులకు
ఘనతరంబైన నరకంబు గట్టిముల్లె
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 53

సీ. పరులద్రవ్యము మీఁద భ్రాంతి నొందినవాఁడు
పరకాంతల కపేక్ష పడెడువాఁడు
అర్థుల విత్తంబు లపహరించెడువాఁడు
దాన మియ్యంగ వద్దనెడివాఁడు
సభలలోపల నిల్చి చాడి చెప్పెడివాఁడు
పక్షపు సాక్ష్యంబు పలుకువాఁడు
విష్ణుదాసులఁ జూచి వెక్కిరించెడివాఁడు
ధర్మసాధులఁ దిట్టఁ దలఁచువాఁడు
తే. ప్రజల జంతుల హింసించు పాతకుండు
కాలకింకర గదలచేఁ గష్టమొందు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 54

సీ. నరసింహ! నా తండ్రి నన్నేలు నన్నేలు
కామితార్థము లిచ్చి కావు కావు