పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/290

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిన్ను భక్తులు పిల్చి నిత్యపూజలు చేసి
ప్రేమఁ బక్వాన్నముల్‌ పెట్టుచుండ్రు
తే. స్వస్థముగ నీకు గ్రాసము జరుగుచుండఁ
గాసు నీ చేతి దొకటైనఁ గాదు వ్యయము
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 48

సీ. పుండరీకాక్ష! నారెండు కన్నుల నిండ
నిన్నుఁ జూచెడి భాగ్యమెన్నఁడయ్య
వాసిగా నా మనోవాంఛ దీరెడునట్లు
సొగసుగా నీ రూపు చూపవయ్య
పాపకర్ముని కంటఁ బడకబోవుదమంచుఁ
బరుషమైన ప్రతిజ్ఞఁ బట్టినావె?
వసుధలోఁ బతిత పావనుఁడ వీ వంచు నేఁ
బుణ్యవంతుల నోటఁ బొగడ వింటి
తే. నేమిటికి విస్తరించె నీకింత కీర్తి
ద్రోహినైనను నా కీవు దొరకరాదె?
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 49

సీ. పచ్చి చర్మపుఁదిత్తి పసలేదు దేహంబు
లోపల నంతట రోయ రోఁత
నరములు శల్యముల్‌ నవరంధ్రములు రక్త
మాంసంబు కండలు మైల తిత్తి
బలువైన యెండ వానల కోర్వ దింతైనఁ
దాళలే దాఁకలి దాహములకు
సకల రోగములకు సంస్థానమై యుండు
నిలువ దస్థిరమైన నీటి బుగ్గ