పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/187

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

-: ఆత్మసర్వగతలక్షణము :-
66. సీ. ధరణిలోఁ దిలయందుఁ దైలముండినతీరు
దారువునం దున్నదహమురీతి
నాణెమౌ దధియందు నవనీత మున్నట్లు
పుష్పమందున గంధ మున్నయట్లు
రంజిల్లు ఫలమందు రసము లుండినభంగి
జేలమం దున్నట్టి నూలుభంగి
తారహారాదులదార ముండినతీరు
నిసుకరాళ్ళందున్న యినుముతీరు
గీ. నఖిలజగముల సకలదేహంబులందు
నిండియున్నాఁడ వీరితి నిజముగాను
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.

-: దేహేంద్రియవిలక్షణము :-
67. సీ. నాతల్లి నాతండ్రి నాసతు ల్నాసుతు
ల్నాపశుసంఘంబు నాగృహంబు
నాభూషణంబులు నావాహనంబులు
నాక్షేత్రపాత్రము ల్నాజనంబు
నాధ్యాన మని పల్కినపుడు పురుషుండు
తానవిగాక వేఱైన విధము
నాశరీరంబును నాయింద్రియంబులు
నాజీవధర్మము ల్నాగుణంబు
గీ. లనుచు బల్కిన దేహేంద్రియాదులకును
నీవు వేఱుగ నుందువు నిశ్చయముగ
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.