పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/175

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

-: జన్మహేతులక్షణము :-
42. సీ. ఆత్మయందున మాయ యారోపితంబయ్యె
మాయయం దజ్ఞాన మపుడు గలిగె
నజ్ఞానమునఁ దోచె నవివేక మవివేక
మందున నభిమాన మమరఁ బుట్టె
నభిమానమందు రాగాదు లుద్భవమయ్యె
రాగాదులందుఁ గర్మములుఁ బొడమె
కర్మలవలనను గడలేని సుఖదుఃఖ
మూలమైనశరీరములఁ జనించె
గీ. నీవిధంబున దేఖంబు లెత్తి జనులు
నిన్నుఁ గనలేరు నిరుపమ నిర్మలాత్మ
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.

43. సీ. రాతిరిపడియున్న రజ్జు వంతటఁ జూచి
భ్రమసి పామని భయపడినయట్లు
శూక్తి దూరంబునఁ జూచి వెండి యటంచు
ప్రబలినయాశచే భ్రమసినట్లు
దండకారణ్యమం దెండుమొద్దును జూచి
దొంగవాఁడని భీతి దోఁచినట్లు
కలలోన వస్తువు ల్గని మేలుకొనలేచి
నావస్తువుల వెదుకాడినట్లు
గీ. నరులు సత్యయు జగమని నమ్మినారు
జ్ఞానపథమందు నిజరూపు గానలేక
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.